చిన్న పిల్లలు మీకేమి తెలుసు?

07/11/2010

చిన్న పిల్లలు మీకేమి తెలుసు?

మనం రోజు వింటున్న,లేదా అంటున్న మాట. నా జీవితంలో జరిగిన 3 సంఘటనల గురించి ఈ టపా. చదివిన తరువాత ఆ పై మాట వాడొచ్చో లేదో తేల్చుకోండి.

********************************************************************************

చెన్నై నుంచి బెంగళూర్ బస్సులో వెళ్తున్నా. వెల్లూర్ దాటాక బస్సు ఒక చోట టీ కోసం ఆపారు. కొంచం కాళ్ళు పట్టేసినట్టు ఉంటే దిగాను.

అక్కడ జనాలు అందరు టీ తాగి,దమ్ము కొట్టి ఆనందిస్తున్నారు. నేను ఎలాగో ఆ రెండు తాగను, వాళ్ళు వదులుతున్న పొగని ఆస్వాదించడం ఎందుకు అని పక్కన ఉన్న పాప్ కార్న్ కొట్టు దగ్గర నిల్చున్నా.

అందరు టీ, కాఫీ, సిగరెట్లు తాగి అక్కడే ఖాళీ కప్పులు, సిగరెట్టు ముక్కలు పడేసి వాళ్ళ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటున్నారు.

ఒక చిన్న పాప వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి పాప్ కార్న్ కొనిపించుకుంది.ఆ పాప్ కార్న్ కోన్ పట్టుకుని మెట్టు దిగుతూ పడబోతే వాళ్ళ నాన్న పట్టుకున్నారు. పాప చేతిలో ఉన్న పాప్ కార్న్ కోన్ లోంచి సగం పాప్ కార్న్ నేల మీద ఒలిగిపోయింది.

“నేను పట్టుకుంటాను అంటే పట్టుకోనిచ్చావు కాదు” అని వాళ్ళ నాన్న తిడుతున్నాడు. ఆ పాప తన చేతిలో ఉన్న కోన్ ని వాళ్ళ నాన్న చేతిలో పెట్టి కింద పడిన పాప్ కార్న్ ఏరడం మొదలు పెట్టింది.వాళ్ళ నాన్న మొహం ఎర్రగా మారిపోయింది.

“కింద పడినవి తినకూడదు అని చెప్పాను కద, అవి అక్కడే వదిలెయ్.అందరు చూస్తున్నారు.”, అని కోపం గా చూస్తున్నాడు.

ఆ పాప ఏరిన పాప్ కార్న్ తీసి పక్కన ఉన్న చెత్తకుండి లో వేస్తూ,”మనం ఏ తప్పు చేసినా కరక్ట్ చేసుకోవాలి అని కూడా చెప్పారు కద డాడీ. నేనే కింద పడేసాను కద డాడీ కాబట్టి నేనే ఎత్తాలి కద” అనేసి చేతులు దులిపేసుకుంది.

చుట్టూ చూస్తున్న వాళ్ళకి మాటలు లేవు, నాలాగే.

***************************************************************************

మా మవయ్య ఒకాయన ఉన్నారు. ఆయనంటే చిన్నపటి నుంచి మాకు అందరికీ భయం. మా అమ్మ, పిన్నులు కూడా అన్నం తినక పోతే మావయ్య ని పిలుస్తా, అల్లరి చేస్తే మావయ్యని పిలుస్తా…ఇలా బెదిరించడంతో చినప్పటి నుంచి ఆయనంటే అదొక రకమైన భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం.మేము ఎంత పెద్ద వాళ్ళం అయినా అది అలాగే ఉండిపోయింది.

ఆయన కూడా ఆ ఇమేజి కాపాడుకోవడం కోసం అనుకుంటా, ఎప్పుడు చాలా సీరియస్ గా ఉండేవారు. ఆ ఇమేజి మా తరువాత తరానికి కూడా క్యారీ చేశారు.

ఒకసారి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి సీరియస్గా,”తాత ఎప్పుడు ఎందుకు అంత సీరియస్ గా ఉంటావు?….నువ్వు నవ్వుతూ ఉంటే అందరం నీకు ఫ్రెండ్స్ అయ్యిపొతాం కద” అనేసింది.

అది విని నాకు అనిపించింది, అవును ఈయన నవ్వు చివరి సారి ఎప్పుడు చూసానబ్బా అని.

అప్పటి నుంచి ఆయన కొంచం నవ్వడం మొదలుపెట్టారు.

*********************************************************************************

ఒకసారి వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్నా. howrah – chennai మెయిల్ అనుకుంట.

అందరు 8.30 కల్లా తినేసి పడకేసేశారు. నాకేమో 12.00 కి గాని నిద్రరాదు.

నాది అప్పర్ బర్త్, కాబట్టి కూర్చుని ఉన్నా. ఒక ఫామిలీ అనుకుంటా, ఒక జంట, వాళ్ళకో 6-7 ఏళ్ళ బాబు. భార్య భర్త లోవర్ లో పడుకున్నారు. బాబు నా బర్త్ కింద ఉన్న మిడిల్ లో పడుకున్నాడు. మరో మిడిల్ లో నా ఏజ్ ఉన్న ఎవరో అబ్బాయి పడుకున్నాడు.

ఆ మిడిల్ బర్త్ లో ఉన్న కుర్రాడు, హెడ్ ఫోన్లు తగిలించుకొని మరీ, గర్ల్ ఫ్రెండ్ తో అనుకుంటా సోది వేస్తున్నాడు. మనకి అలాంటి సౌలభ్యం లేదు కనుక “డోంట్ మ్యారీ బీ హ్యాపీ”, “నమ్మద్దు నమ్మద్దు ఆడ వాళ్ళని నమ్మద్దు” లాంటి పాటలు వింటూ కాలక్షేపం చేస్తున్నా.

ఏసీ కోచ్ అవ్వడం వల్ల మన హీరో గారి మాటలు అన్నీ క్లియర్ గా వినిపిస్తున్నాయి. అవతల హీరోయిన్ గారు అలిగినట్టు ఉన్నారు, ఈయన బుజ్జగిస్తున్నారు. వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కొంచం అనీసీగా కూడా ఉంది.

సడన్ గా మధ్య బర్త్ లో ఉన్న బుడుగు లేచి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, “మమ్మీ, మమ్మీ గట్టిగా మాట్లాడి పక్క వాళ్ళని డిస్టర్బ్ చెయ్యడం బాడ్ మానర్స్ అని చెప్పావు కద, ఆ అంకుల్ కి వాళ్ళ మమ్మీ చెప్పలేదా”, అనేసాడు.

రెండు,మూడు కిసుక్కులు వినిపించాయి. వాళ్ళ అమ్మకి ఏమి అనాలో తెలియక,”గొడవ చెయ్యకుండా పడుకో” అనేసింది.

మళ్ళీ ఆ వైపు నుంచి ఒక్క మాట వినబడలేదు.

*********************************************************************************

16 Responses to “చిన్న పిల్లలు మీకేమి తెలుసు?”

  1. Rishi Says:

    3 సంఘటనలూ బాగున్నాయి.నాకు మా అబ్బాయితో ఇంచుమించు ఇలాంటి అనుభవాలే ఉన్నాయి.ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ఎక్సెట్ర విషయాలలో.

    • Pavan Says:

      హ్హహ్హా….అవునా..అయితే మీరు కూడా ఒక పోస్టు వెయ్యండి మీ అబ్బాయి గురించి.

      వ్యాఖ్య రాసినందుకు…థాంక్స్

      - పవన్

  2. రవి చంద్ర Says:

    చిన్నపిల్లలకు ఏది చెప్పినా చక్కగా ఆచరిస్తారని చెప్పడానికి మీరు ఉదహరించిన సంఘటనలే తార్కాణం. కాకపోతే మనం వాళ్ళకు క్లాసులు పీకడంలో చూపించిన శ్రద్ధ ఆచరణలో చూపించం అక్కడే వస్తుంది సమస్యంతా…


  3. పిల్లలకి ఉన్న గ్రహణ శక్తి, విచక్షణ అమోఘమైనవి. మనకి చిన్నప్పుడు ఉన్న ఆ లక్షణాలని, పెరిగే కొద్దీ లౌక్యం అనే పేరుతో నొక్కి పెట్టేస్తాం, మళ్ళీ ఇలాంటి బాళగురువులు ఎదురై గీతాబోధ చేసే దాకా.
    బాగా రాశారు.

    • Pavan Says:

      బాగా చెప్పారు.నేను ఒక పోస్టు మొత్తం చెప్పాలి అనుకున్నది మీరు ఒక లైనులో చెప్పారు.

      వ్యాఖ్య రాసినందుకు థాంక్స్. మీరు నా పోస్టుకి వ్యాఖ్య రాయడం అంటే, నా దృష్టిలో , గల్లీ క్రికెటర్ కి సచిన్ టెండూల్కర్ వచ్చి మ్యాన్ ఆఫ్ ద మాచ్ అవార్డ్ ఇచ్చినంట గొప్ప.

      మీలాంటి బ్లాగ్ పెద్దల ఆశీస్సులే మాకు కావాలి.

      - పవన్

  4. krishna Says:

    ఎక్సలెంట్ పోస్టు పవన్ గారు, చాలా బాగా రాసారు.

    • Pavan Says:

      చాలా థాంక్స్ అండి రెగులర్ గా నా పోస్టులు చదువుతున్నందుకు, వ్యాఖ్యలు రాస్తున్నందుకు.

      - పవన్


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.