వార్తల్లో ముఖ్యాంశాలు – The Other Side of the coin
05/07/2010

అందరికీ నమస్కారం.
గత వారం పది రొజులుగా కొంచం పని ఎక్కువగా ఉండి మెయిల్స్ కూడా చూసుకోలెకపోతున్నా. ఇంక టపాలు రాసే టైం ఎక్కడ.
నేను ముందు టపాల్లో రాసిన ఆరంభ శూరత్వం అవ్వకూడదని మళ్ళీ టైం చేసుకుని రాస్తున్నా.
ఈ వారం రోజులలో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి ఈ టపా.
IPL అయ్యిపోయింది. మా చెన్నై టీం గెలిచింది. (గెలిచిన టీం మన టీం అనుకుంటే ఏ బాధ ఉండదు).
కాని ఫైనల్స్ టైంలో గ్రౌండ్ లో కన్నా బయట చాలా విషయాలు జరిగాయి. ఈ వ్యవహారం మొత్తంలో ముగ్గురి పేర్లు వినిపించాయి.
మొదటి వ్యక్తి షషి థరూర్ ని మినిస్టర్ పోస్టు నుంచి తీసేసి, కేబినెట్ మినిస్టర్ రేంజ్ లో విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీలో వేసారు. కేరళ కాంగ్రెస్ లో మంచి పోస్టు కూడా ఇస్తారు అని ఒక పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఉంది.
ఇంక అతని జిగిరీ దోస్తు రెండో వ్యక్తి లలిత్ మోడి ని BCCI పూర్తిగా నిషేదించినంత పని చేసి, అతనిని సంజాయిషీ ఇవ్వమంది. ఆయన గారు ఇప్పటికీ తన తప్పు ఏమి లేదు అనే అంటున్నాడు. IT శాఖ వారు అన్ని జట్ల ఆఫీసులలో సోదాలు చేసారు, ముంబై జట్టు ఆఫీసులో తప్ప. ఎంతైనా అంబానీ టీం కద. చాలా మంది పైకి కనిపించిన వ్యక్తులు అసలు టీం ఓనర్లు కారు అని తెలిసింది.
ఇక ఈ గొడవ జరుగుతుండగా బయటకు వచ్చిన, ఇప్పుడు అందరు మర్చిపోయిన వ్యక్తి సునందా పుష్కర్. మన దేశంలో మీడియా ఎంతకి దిగజారిందో చెప్పడానికి ఈమె ఒక సజీవ ఉదాహరణ. లలిత్ మోడీ ఈమె పేరు బయట పెట్టగానే, ఈవిడ చరిత్ర మొత్తం తవ్వారు.అందులో వాళ్ళకి కావలసిన విషయాలు హైలైట్ చేసి ఆవిడ వ్యక్తిత్వాన్ని చంపేసారు. ఆవిడ ఏ పార్టీ లో ఎవరితో కనిపించింది, ఎవరితో సంబంఢాలు ఉండొచ్చు అని రకరకాల పరిశోధనలు చేశారు. కాని ఆవిడ జీవితంలో అనుభవించిన కష్టాలు, వాటిని అధిగమించిన తీరు మొదలైన విషయాలను తొక్కేశారు.
ఒక కాష్మీరీ పండిట్ కూతురుగా, భర్తను కోల్ఫోయి, మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక కొడుకు కి సింగిల్ మథర్ గా, ఒక విజయవంతమైన బిజినెస్ కన్సల్టెంట్ గా, ఆవిడ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఒక సినిమాకి సరిపడా కథా వస్తువు ఆవిడ జీవితం. కాని ప్రజల దృష్టిలో ఆవిడని అథాపాతాళానికి తొక్కేసారు. అందంగా కనిపించడమే తన తప్పు అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో బాధ పడింది.
ఇంతా చేసి ఆవిడకి వచ్చిన లాభం ఏమిటయ్య అంటే, స్వెట్ ఈక్విటీ. అంటే, ఒకవేళ ఆ కొచ్చి జట్టు లాభాల్లోకి వస్తే, ఈవిడకి ఒక 70 కోట్లు వస్తాయి. అంటే డబ్బులు వస్తాయి అన్న గ్యారంటీ లేదు. మొదలైన మూడు సంవత్సరాల తరువాత ఈ ఏడాది ముంబై టీం, 50 కోట్లు లాభం సంపాదించింది. మిగిలిన జట్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. అంటే వస్తుందో రాదో తెలియని డబ్బు ఆవిడ సంపాదించేసింది అని, ఆవిడ వ్యక్తిత్వాన్ని కించ పరిచారు.
ఇందులో తప్పు మీడియాది మాత్రమేనా?…. నన్ను అదిగితే ప్రజలది కూడా అంటాను, అలాంటి చానళ్ళను పోషిస్తున్నందుకు. ఏదైన ఘటన జరిగింది అని వార్త రాగానే మనం ముందు పెట్టే ఛానల్ ఖచ్చితంగా ఈ సెన్సేషనల్ చానల్స్ లో ఒకటి.
ఇక మరో ముఖ్య సంఘటన….. ముంబై మారణ హోమంలో పోలీసులకు చిక్కిన ఏకైక వ్యక్తి, అజ్మల్ కసాబ్ ఉరి శిక్ష. నిజంగా అది ఒక శిక్షేనా. అతను ఒక జీహాదీ. అంటే ప్రాణాలు అర్పించడానికి సిధ్ధపడి ఇక్కడికి వచ్చాడు. అతనిని పట్టుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి విచారించి, చివరికి అతని కోరికని నెరవేరుస్తున్నాం.
ఆ మారణ హోమానికి కారణమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాని మనకి కనిపించే వ్యక్తి ఈ కసాబ్ ఒక్కడే.ప్రజల దృష్టిని,కోపాన్ని ఇతని పైకి మళ్ళించింది మీడియా. ప్రజలేమో అతన్ని నడి వీధిలో ఉరి తీయాలి అని కోపంతో ఊగిపోతున్నారు. వాళ్ళ కోరిక ప్రకారమే అతనికి ఉరి శిక్ష పడింది.
ఒక్క సారి ఆలోచించండి….అతని బ్యాక్ గ్రౌండ్ గురించి. అతనొక 18 – 20 ఏళ్ళ యువకుడు.పేదరికమో, పరిస్థితుల ప్రభావమో ఉగ్రవాదం వైపు మళ్ళాడు. కొన్ని వార్తల ప్రకారం ఆ 10 మంది ముంబైలో దిగినప్పుడు డ్రగ్స్ ఎక్కించుకొని కాల్పులకు తెగబడ్డారు. కాబట్టి అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియకపోయి ఉండవచ్చు. ఇదే తప్పు మీకు తెలిసిన ఏ కుర్రాడో చేస్తే మీరు కనిసం అతను అలా చెయ్యడేమో అని ఆలోచిస్తారు, ఇంకా కాదు అంటే, శిక్ష అనేది ఖైదీ లో పరివర్తన తేవాలి, చంపకూడదు అని కూడా అనొచ్చు. నేను ఐతే అదే అనేవాడినేమో.
కాని తెలిసి చేసినా తెలియక చేసినా, తప్పు తప్పే. కాబట్టి అతనికి శిక్ష పడాల్సిందే. కాని ఉరి శిక్షే ఎందుకు? .ఈ తీర్పు చెప్పినప్పుడు ఆ జడ్జి ఏమి అన్నారు అంటే…”ఇతనకి కఠిన కారాగార శిక్ష విధిస్తే మళ్ళీ కాందహార్ వంటి ఘటనలు జరగొచ్చు, అందుకే ఉరి శిక్ష” అని తేల్చారు.
అంటే కందహార్ లాంటివి జరిగినా ఆపే పరిస్థితిలో మన ప్రభుత్వం, వ్యవస్థ లేదు అని ఒప్పుకున్నట్టే కదా.
ఈ మొత్తం వ్యవహారంలో శిక్ష వేస్తే కసాబ్ తో పాటు అది అనుభవించ వలసిన వ్యక్తులు: అప్పటి హోం మంత్రి శివరాజ్ పాటిల్, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేష్ముఖ్, అప్పటి మహరాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్, కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్, డెప్యూటీ డైరక్టర్ జనరల్ (కోస్టల్ సెక్యూరిటీ), నావల్ ఛీఫ్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్……ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.
కాని వీళ్ళు ఎవరు కోర్టు వైపు కూడా చూసినట్టు లేదు.శివరాజ్ పాటిల్ పంజాబ్ గవర్నర్ గా విశేష సేవలు అందిస్తున్నారు. విలాస్ రావ్ దేష్ముఖ్ ప్రస్తుత కేంద్ర భారి పరిశ్రమల, ప్రజా ప్రయోజక సంస్థల మంత్రి. ఆర్.ఆర్.పాటిల్ ఇంకా మహరాష్ట్ర హోం మంత్రి గానే కొనసాగుతున్నారు. పైన పేర్కొన్న మిగిలిన బ్యూరోక్రాట్లు ఎవ్వరినీ కనీసం సస్పెండ్ చేసినట్టు కూడా లేదు.
న్యాయం అందరికీ సమానం అయ్యినప్పుడు ఈ తేడాలేమిటి. అంటే రాజకీయ నాయకులకి, ప్రభుత్వోజ్యోగులకి న్యాయం కొంచం ఎక్కువ సమానమా ?
కాని ఈ రెండు సంఘటనలలో మనం ఏమి చెయ్యగలం, మన చేతుల్లో ఏమి ఉంది అని అనిపిస్తుంది కదా. మనం చెయ్యగలిగినవి రెండు ఉన్నాయి.మొదటిది మన వోటు హక్కుని సరైన విధంగా ఉపయోగించడం.
రెండు, మీడియా చూపించినదే ప్రపంచం అనుకోకుండా, నాణేనికి రెండో వైపు ఉన్నట్టు, మనం కూడా ప్రతి విషయాన్ని మరో ధృక్కోణం లో విశ్లేషించడం నేర్చుకోవాలి.
ఏంటో, వార్తలు రాస్తుంటే డీడీలో వార్తలు చదివే శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చారు. ఆయన లాగ మిమ్మల్ని బోరు కొట్టించలేదు అని ఆశిస్తూ,
- పవన్


05/08/2010 at 6:04 సాయంత్రము
విశ్లేషణ బాగుంది. కసబ్ తో పాటు అతడు దేశంలోకి ప్రవేశించే వరకు మొద్దు నిద్రపోయిన వాళ్ళకి కూడా శిక్ష పడాలి. కాని అలా జరిగితే ఇది భారతదేశం ఎందుకవుతుంది.
మరోమాట పాపం శాంతిస్వరూప్ ని ఎందుకండీ అలా అన్నారు. అతడు వార్తలు చదివితే ఎలాంటి వారికైన అర్థం కావాలి. దూరదర్శన్ అంటే శాంతిస్వరూప్, శాంతిస్వరూప్ అంటే దూరదర్శన్.