నేను నిన్ను వదులుకోలేను
04/24/2010
“నేను నిన్ను వదులుకోలేను, I don’t want to miss you,”
మోకాళ్ళ మీద కూర్చొని రవి అలా అనేసరికి, ఒక్కసారిగా షాక్ అయ్యింది బిందు. రవి ఇలా రియాక్ట్ అవుతాడు అని తను అసలు అనుకోలేదు, అది కూడా ఫేర్వెల్ పార్టీలో.
తను అసలు ఏమి అంది ? … “I think I will miss you”, అంతేగా.
“రవి నేను ఆ ఉద్దేశంతో అనలేదు”
“నేను మాత్రం అదే ఉద్దేశంతో అడుగుతున్నాను. ప్లీజ్ ఒప్పుకో. నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావనీ తెలుసు.”, మోకాళ్ళ మీద అలాగే ఉండిపోయాడు రవి.
పూర్తి డిఫెన్సివ్ లో పడిపోయింది బిందు. రవికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ తల పైకి ఎత్తింది. దూరంగా హర్షిత నవ్వుతూ కనిపించింది.
“అదే చెప్పి ఉంటుంది, దానికొక్క దానికే తెలుసు, ఈ రోజు నా చేతుల్లో అయ్యిపోయింది”, మనసులో అనుకుంది బిందు.
ఒక పక్క ఆనందంగానే ఉన్నా, ముందు ఇక్కడి నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తోంది. అందరూ తమనే చూస్తున్నారు, ఆశ్చర్యంగా. తనకీ ఆశ్చర్యంగానే ఉంది. రవి ఏంటి, ఇలా ఏంటి అని. రవి కి కాలేజ్ లో మంచి పేరు ఉంది. టాపర్. బుధ్ధిమంతుడు, చూడడానికి బానే ఉంటాడు కూడా. అతనికి అమ్మాయిలు పెట్టిన నిక్ నేమ్ ముద్ద పప్పు.
బిందు కూడా తక్కువేమీ కాదు. బాగానే చదువుతుంది. కాలేజ్ బ్యూటీల్లో ఒకర్తి.
ఎలాగైనా ఈ సిట్యువేషన్ లోంచి బయట పడాలి అనుకొని, “లెగు రవి, అందరూ మనల్నే చూస్తున్నారు. మనం తరువాత మాట్లాడదాం.”
“లేదు బిందు. నువ్వు ఒప్పుకుంటేనే లెగుస్తాను. ఇప్పటికే చాలా లేట్ చేసాను. ప్లీజ్ ఒప్పుకో”
“సరే లెగు. అయినా ఫేర్వెల్ పార్టీలో ఏంటి ఇది”
“ఐతే నువ్వు ఒప్పుకున్నట్టే కదా ? …. ఇందాకే హర్షిత చెప్పింది, నేనంటే నీకు ఇష్టం అని, కాని నేను ఎలా రియాక్ట్ అవుతానో అని చెప్పడం లేదు అని చెప్పింది. ఆలోచిస్తే మళ్ళీ మనం కలవడం జరుగుతుందో జరగదో. కలిసినా అప్పటికి ఎలా ఉంటామో అనిపించింది. అప్పుడు అయ్యో మిస్ అయ్యానే అనుకోవాలి. ఇంక ఆగలేక పోయాను. ” , అలా చెప్పుకుంటూ పోతున్నాడు రవి.
“ఆగు ఆగు. ముందు ఎగ్జామ్స్ అవ్వనీ. అప్పుడు కలిసి మాట్లాడదాం ఫ్యుచర్ గురించి”, అనేసి, ఇంక అక్కడే ఉంటే కష్టం అనుకొని ఇంటికి బయలుదేరింది.
ఎగ్జామ్స్ అయ్యాయి. రవి మామూలుగా బాగానే రాసాడు. బిందు ఏదో అయ్యాయి అనిపించింది.
చివరి ఎగ్జామ్ తరువాతి రోజు ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నారు. ఇద్దరి ఇంట్లోనూ ఈ విషయం చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇద్దరికీ అప్పటికే ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీ లో కాంపస్ ప్లేస్ మెంట్లు వచ్చాయి కాబట్టి, ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ చెప్పకుండా, ముందు ట్రైనింగ్ కి వెళ్ళి, జాబ్ లో జాయిన్ అయ్యాక చెప్దాం అని డిసైడ్ అయ్యారు.
ఆరు నెలల తరువాత, ఇద్దరికీ ట్రైనింగ్ వేరు వేరు ఊర్లలో జరిగినా, ఇద్దరూ కంపనీ వాళ్ళని బ్రతిమాలుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇద్దరూ శెలవు తీసుకుని ఊరు వెళ్ళి, ఇంట్లో చెప్పారు. రవి వాళ్ళ ఇంట్లో చూద్దాం అన్నారు.
బిందు వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా పెద్ద పెద్ద రియాక్షన్స్ వచ్చాయి. “నిన్ను ఇందుకేనా చదివించింది”, అని వాళ్ళ అమ్మ. “అసలు అమ్మాయిని చదివించొద్దు అంటే విన్నారు కాదు, ఉద్యోగం కూడా చేయిస్తున్నారు, మా కాలం లో ఇలాంటివి వినలేదు”, అని వాళ్ళ బామ్మ. వాళ్ళ నాన్న గారు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. “మొన్న మా రామారావు ఎవరో అబ్బాయి గురించి చెప్పాడు. హైదరాబాద్ వెళ్ళి జాబ్ కి రెండు నెలలు లీవు పెట్టి రా. అబ్బాయి వాళ్ళని చూసుకోడానికి పిలుస్తాను “, అన్నారు కూల్ గా.
హైదరాబాద్ వచ్చాక ఇద్దరూ వాళ్ళ ఇంట్లో జరిగినవి చెప్పుకున్నారు. ఇంక లేట్ చేస్తే లాభం లేదు అనుకొని రవి వాళ్ళ ఇంటికి ఫోను చేసి పెళ్ళికి డేట్ చూడమని చెప్పాడు. “నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నీకూ మాకూ ఏ సంబంధం ఉండడు”, అని రెస్పాన్స్ వచ్చాక ఇక ఏ దారీ లేక ఫ్రెండ్స్ సహాయంతో ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకున్నారు.
వాళ్ళ డాడీ అర్థం చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళిన బిందు ని వాళ్ళ నాన్న గారు ఒకటే అన్నారు. “నీ మీద నమ్మకంతో నిన్ను చదివించాను, ఉద్యోగం చెయ్యనిచ్చాను, మీ విషయం చెప్పినా, నా మాట వింటావనే నమ్మకంతో నిన్ను ఒక్కదాన్నే హైదరాబాద్ పంపించాను. నా మాట నీకు లెక్క లేనప్పుడు, నీ పెళ్ళిని, ఈ అబ్బాయిని నేను ఎందుకు లెక్క చేయాలి ?”
ఇద్దరూ హైదరాబాద్ వచ్చేసారు. ఇక ఒకరికి ఒకరు అనుకొని జీవితాన్ని ప్రారంభించారు. ఇద్దరూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చారు. రవి కి ఇంకో మంచి కంపనీలో మంచి ఆఫర్ వస్తే అక్కడికి మారాడు.
రెండు ఏళ్ళు గడిచాయి. బిందు ఒక పాప కి జన్మనిచ్చింది. రెండు ఇళ్ళకూ కబురు పెట్టారు. రవి వాళ్ళు ఎవరూ రాలేదు కాని బిందు వాళ్ళ నాన్న గారు వచ్చారు. రవి బిందుని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసి ఆనందించారు. బిందు వాళ్ళ ఇంటి నుంచి ఫోన్లు రావడం మొదలు అయ్యాయి.
అమెరికా నుంచి తిరిగి వచ్చిన తన ఫ్రెండ్ తో కలిసి ఒక సాఫ్ట్ వేర్ కంపనీ మొదలు పెట్టాడు రవి. బిందు ని జాబ్ మానిపించాడు.
ఒక సంవత్సరం గడిచింది. లోను తీసుకొని ఒక మంచి ఇల్లు కొన్నాడు రవి. కారు కొన్నాడు. మొత్తం లైఫ్ స్టైల్ మార్చేశాడు.
అప్పుడు వచ్చింది రిసెషన్. ఆర్థిక మాంద్యం.
రవి కి పని పెరిగింది, వత్తిడి పెరిగింది. ఇంట్లో చిరాకు పడటం పెరిగింది. రవి ఇంటిలో ఉండే టైము తగ్గింది.
బిందుకి రవి తనకి దూరం అవుతున్నాడన్న భావన కలగడం మొదలైంది.
ఒక రోజు రవి మధ్యానం ఇంటికి వచ్చి, “నువ్వు పాప కలిసి మీ డాడీ దగ్గరకి వెళ్ళండి. ఎప్పటి నుంచో రమ్మని అంటున్నారని అన్నావు కద. ఈ రోజు సాయంత్రం ట్రైను కి టికట్టు బుక్ చేసాను” అన్నాడు.
బిందు కి ఏమీ అర్థం కాలేదు. నిన్ననే వాళ్ళిద్దరికీ గొడవ అయ్యింది. ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ గొడవ అవుతుందేమో అని ఏమీ అనకుండా తనవి పాప వి బట్టలు సర్దుకుంది.
సాయంత్రం స్టేషన్లో దింపాడు రవి. “జాగ్రత్త. దారిలో మీ డాడీకి ఫోను చెయ్యి “, అన్నాడు.
అప్పుడు గుర్తు వచ్చింది బిందుకి ఫోను మర్చిపోయింది అని. రవికి చెప్తే, “ఎందుకు అంత గాబరా. ఇదిగో నా ఫోను పట్టుకు వెళ్ళు”, అని ఇచ్చాడు.
“నీ ఫోనా. నాకు ఎలా వాడాలో సమంగా తెలియదే. సరేలే ఏదోకటి పడతాను గాని, నువ్వు బయలుదేరు, మళ్ళీ మన ఇంటి దగ్గర స్కూల్ వదిలితే, ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది”, అని రవి ని పంపించేసింది బిందు.
బిందు అన్నట్టుగానే రవి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు.
ఇక్కడ బిందు ట్రైను అరగంట లేటు. ఖాళీగా ఉంది కదా అని, రవి ఫోను లో ఫీచర్స్ చూడటం మొదలు పెట్టింది. ఒక చోట తన చూపు ఆగిపోయింది. ట్రైను వస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. బిందు బయలుదేరింది.
రవి ఇంటికి వచ్చాడు. హాలులో ఉన్న స్విచ్ బోర్డు దగ్గరకి వచ్చాడు. స్విచ్ దగ్గర చెయ్యిపెట్టాడు. అది చాలా రోజులుగా రిపేరులో ఉంది. స్విచ్ నొక్కి ఒక అయిదు నిమిషాలు పట్టుకుంటే, అంతా అయ్యిపోతుంది. ఒక్కసారి రవి ఆలోచించాడు.
“రేపు ఇల్లు సీజ్ చేస్తారు. కారు కూడా తీసుకువెళ్తారేమో. అసలు బిజినెస్ లోకి దిగకుండా ఉండవలసింది. రిసెషన్ వల్ల చేతిలో ఉన్న ప్ర్రాజెక్టులు పోయాయి. ఈ రోజు బిజినెస్ పార్ట్ నర్ IP పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక నా కెరీర్ అయ్యిపోయింది. బిందుకి ఇదేమీ తెలియకూడదు. బిందుకి ఏమీ కాకూడదు. నా ఇన్సూరన్స్ డబ్బులతో తను, పాప వాళ్ళ డాడీ దగ్గర బాగానే ఉండొచ్చు.”
ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడు.
“ఈ టైంలో ఎవరు? బిందు వచ్చేసిందా ? …. ఇప్పుడు తలుపు తీయక పోతే అనుమానం వస్తుంది. నాది సుసైడ్ అని తెలిస్తే తను తట్టుకోగలడా”, అనుకుంటూ తలుపు తీసాడు. ఎదురుగా బిందు.
“ట్రైను మిస్ అయ్యిందా బిందు ?”
“నేను నిన్ను మిస్ అవ్వలేను, I don’t want to miss you”, అని రవిని పట్టుకోని ఏడ్చేసింది బిందు.
(గమనిక: ఈ టపాలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితం. రిసెషన్, ప్రేమ తప్ప)


04/25/2010 at 5:17 సాయంత్రము
చాలా చాలా బాగు౦ది..ఆసక్తి చదివి౦చారు చివరివరకు…
04/25/2010 at 6:50 సాయంత్రము
ఓపికగా చదివినందుకు, చదివి వ్యాఖ్య రాసినందుకు, ధన్యవాదములు
- పవన్
04/25/2010 at 7:08 సాయంత్రము
చాలా చాలా బాగా రాసారండి పవన్ గారు.ప్రతీ సారి ఇదే మాట అనాలి అంటె నాకు మొనాటనిగా వుంది,మీకు మొనాటనిగా లేదా?ఇంతకి రవి ఫోనులో బిందు ఏమి చూసి వెనకకి వచ్చింది?కొన్ని విషయాలు చెప్పక పోయిన కధకి ఒక బిగువు వస్తుంది తప్ప నష్టం లేదు.అందుకే ఆ విషయం రాయలేదా?
04/25/2010 at 8:41 సాయంత్రము
బిందు రవి ఫోనులో ఏమి చూసింది, రవి ఏమి చెయ్యబోతున్నాడో ఎలా తెలిసింది లాంటి విషయాలు పాఠకుల ఊహకు వదిలేసాను. ఈ టపాలో ఇలాగే చాలా విషయాలు రాసి తరువాత తీసేసాను.
చివరలో బిందు ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. కాని ఈ టపా ఉద్దేశం మెసేజ్ ఇవ్వడం కాదు, ప్రేమ ఎలా రూపాంతరం చెందుతుంది, పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుంది అని చెప్పడానికి ఒక చిన్న కథ. అంతే.
చివరిలో నేను రాసి,నాకు బాగా నచ్చినప్పటికీ తీసేసిన ఒక లైను:
రిసెషన్ ప్రేమను తగ్గించగలదు, కాని ప్రేమ రిసెషన్ ను జయించగలదు.
టపా చదివినందుకు, వ్యాఖ్య రాసినందుకు, ధన్యవాదములు
- పవన్