ప్రొద్దున్నే నిద్ర లేవడం ఎలా?
04/21/2010
ప్రొద్దున్నే నిద్ర లేవడం ఎలా? (రాత్రి ఎప్పుడు పడుకున్నా…)
అసలు నేను బ్లాగులు రాస్తాను అని కలలో కూడా అనుకోలేదు.రాసినా అందులో ఈ విషయం మీద రాస్తాను అని అస్సలు అనుకోలేదు.
పుట్టి బుధ్ధెరిగినప్పటి నుంచి తొమ్మిదిన్నరకే గంటలకే ముసుగు తన్ని పడుకోవడం,మళ్ళీ ప్రొద్దున్న ఎవరైన లేపితే లేవడం.
ఇలా ఉన్న నా జీవితాన్ని మార్చేసింది…..
ఎవరైన అమ్మాయి అనుకున్నారా?
టైటిల్ జస్టిఫికేషన్ లేకుండా రాయడానికి నేను ఏమైనా తెలుగు సినిమా కధ రాస్తున్నానా?
నా నిద్ర స్టైల్ ని మార్చింది ఇంజినీరింగ్.ఏమి చదవాలో తెలుసుకునే సరికే దెయ్యాలు తిరిగే టైము అయ్యేది.చివరికి పరీక్ష హాలు లో నిద్ర వచ్చేది.100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 మంది కూడా చూడని సినిమా నిర్మాత లా అయ్యేది నా పరిస్థితి.ఇక తప్పక నైట్ అవుట్ లు అలవాటు చేసుకున్నాను.అదెంత వరకు వెళ్ళింది అంటే ఫైనల్ ఇయర్ లో అనుకుంటా అస్సలు పడుకోకుండానే చివరి సెమెస్టెర్ లోని అన్ని పరీక్షలూ రాశాను.
దాని వల్ల సైడు ఎఫెక్ట్ లు ఉన్నాయి అనుకోండి.లారీ టైరు నుంచి సైకిలు టైరులా తయారు అయిన జూ.బంటీఆర్ లా నేనూ బాగానే తగ్గాను.చాలా క్లినిక్ ల వాళ్ళు నా ఫొటో కోసం వచ్చేసరికి కళ్ళు తేరుచుకొని, మళ్ళీ గట్టిగా మూసుకొని పడుకోవడం మొదలు పెట్టాను.
ఈ తొందరగా లెగకపోవడం వల్ల నేను ఎంత ఫేమస్ అయ్యాను అంటే,మా ఫ్రెండ్స్ ఒక సారి ఏదో సినిమా మార్నింగ్ షో కి ప్లాన్ చేస్తుంటే విని,నేను కూడా వస్తాను అన్నాను. మరాఠీ సినిమా మళయాళ డబ్బింగ్ చూస్తున్నత్తు మొహం పెట్టి,మేము వెళ్తున్నది మార్నింగ్ షో కి రా,ఈ సారి మ్యాట్నీకో,ఫస్ట్ షోకో ప్లాన్ చేసినప్పుడు చెప్తాంలే అన్నారు.
నా క్లోస్ ఫ్రెండ్ ఒకడు,”పోన్లే తీసుకువెళ్దాంలే రా” అన్నాడు. అయితే వాడిని నిద్ర లేపి తీసుకు వచ్చే బాధ్యత నీది అన్నారు. వాడు కూడా తెలుగు సినిమాలో సైడు కారక్టరు లాగ సరిగ్గా ఆ టైముకి పార్టీ మార్చేశాడు.
ఇక ఇలా లాభం లేదు అని,ఈసారి కవన్ పల్యాణ్ సినిమా రిలీజు రోజు మీ అందరి కన్నా ముందే లేచి,మార్నింగ్ షో టికట్లు తీస్తాను అన్నాను.అందరూ భలేక్రిష్ణ ఫైటింగ్ చూస్తే ఎలా నవ్వుతారో అలా పగలబడి నవ్వారు.
అలాంటి బెట్లు కట్టకు.ఈ జన్మలో అవ్వుతుందో లేదో తెలియదు,త్వరలో వచ్చే ఏ తెలుగు సినిమాకైనా మ్యాట్నీ టికట్లు తీయి చాలు..అని డిసైడు చేశారు.
కొన్ని నెలల తరువాత… (అంటే హమేష్ బాబు సినిమా పాట షూటింగ్ అయ్యాక,చిల్లరి గరేష్ 3 సినిమాలు రిలీజు అయ్యాక)
చేతిలో గానార్జున “బేడీ” సినిమా టికట్లతో మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా.(ఆ సినిమా మధ్యలో మా వాళ్ళకి కనిపించకుండా వచ్చేసాను అనుకోండి).
ఈ మార్పు ఎలా సాధ్యం అయ్యింది అనుకుంటున్నారా ? (ఇక్కడి నుంచి నా గురించి సోది ఉండదు.ముందు చెప్పిన టైటిల్ జస్టిఫికేషన్ చేస్తాను)
ప్రొద్దున్నే నిద్ర లేవడానికి:
1.మీరు పాలవాడైనా,పేపర్ వాడైనా అయ్యి ఉండాలి
2.వంతెన నిత్యపారాయణ అయినా అవ్వాలి
3.గట్టి పట్టుదల అయినా ఉండాలి (అంటే ఎన్ని సినిమాలు పోయినా మళ్ళీ నటించడానికి ప్రయత్నించే మన సూపర్ స్టార్ జితిన్ అంత గట్టిగా)
మీరు మొదటి రెండు అవ్వడానికి ఛాన్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి 3వది ఎలా పెంపొందించుకోవాలో చెప్తాను.
మీరు చాలా చోట్ల చూసే ఉంటారు మనిషి రోజుకి 8 గంటలు నిద్ర కావాలి, 6 గంటలు నిద్ర కావాలి అని.నిజానికి అది అందరు మనుషులకి మీకు కాదు(అంటే మీరు మనిషి కాదు హోమన్ బాబు,అని నా ఉద్దేశం కాదు).ఆ రిపోర్టులు అన్నీ కనీసం ఓ 1000 మంది మీద చేసిన ప్రయోగాలలో వచ్చిన విషయాలు.కాని వాళ్ళు ప్రయోగాలు చేసింది మీ మీద కాదు కద.మరి మీరు ఎన్ని గంటలు పడుకోవాలో ఎవరికి తెలుస్తుంది అంటే….జిరంజీవి కి మల్లూ గురువింద్ లాగ ఎప్పుడూ మీతో పాటు ఉండే మీ శరీరానికి.
ఇంకో విషయం చెప్పాలి.మనకి బుర్రలో రెండు బుర్రలు ఉంటాయి…అర్ధం కాలేదా?…
మనకి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి.అంటే సినిమాల్లో కనిపించే అంతరాత్మ లాగ.అలాంటివి నిజ జీవితంలో బయటకు రావులెంది. (కాన్షియస్ మైండ్ – సబ్ కాన్షియస్ మైండ్ గురించి మరో టపాలో డీటైల్డుగా రాస్తాను)
మనం ఏదైనా అనుకున్నవి జరగాలి అంటే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మాలి.(సాఫ్ ట్ వేర్ భాషలో చెప్పాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ప్రోగ్రాం చేసుకోవాలి)
అలాగని నాకు భలేక్రిష్ణ అంటే ఇష్టం,మల్లూ టార్జన్ అంటే ఇష్టం లాంటివి ప్రోగ్రాం చేసుకోకంది.ఏమైనా జరిగితే నాది బాధ్యత కాదు.
ఇన్నాళ్ళు మీరు ఇన్ని గంటలు పడుకోవాలి అని ప్రోగ్రాం చేసుకున్నారు.ఇప్పుడు ఎన్ని గంటలకి లేవాలో ప్రోగ్రాం చేసుకోండి.ఇది రోజూ మననం చేస్తూ ఉండండి.ఎట్టి పరిస్థితులలోనూ ప్రొద్దున మిమ్మల్ని లేవనివ్వని ఆత్మారాం గాడిని అలారం కొట్టగానే, సచిన్ సిక్సు కొట్టినట్టు చితగ్గొట్టంది.ఈ పని రోజూ చెయ్యండి.శెలవలు,ఆదివారాలు అని చూడకండి.వాన పాట అని చెప్పి భలేక్రిష్ణ తొడగొట్టడం మానేస్తాడా?
ఎప్పుడైతే ఆ ఆత్మారాం గాడు ఏమీ అనడో,అప్పుడు మీ ప్రోగ్రామింగ్ పనిచేసినట్టు.మీరు ఎంత లేటుగా పడుకున్నా ఆ టైముకే నిద్ర లేస్తారు.మీ శరీరానికి నిద్ర చాలలేదు అనిపిస్తే అదే మిమ్మల్ని ఆ రోజు రాత్రి తొందరగా నిద్ర పుచ్చేస్తుంది.
అసలు ప్రొద్దున్నే లేవడం వల్ల ఎన్ని లాభాలు అనుకున్నారు:
1. ప్రొద్దున్నే టీవీలో వచ్చే స్వామీ సత్యానంద సూక్తులు వినొచ్చు.(ఈయన ఈ మధ్య కనబదటం లేదు,కాని ఎవరో ఒక తలకుమాసిన తలనెరిసిన స్వామీజీ సూక్తులు చెప్పడానికి తయారుగా ఉంటారు లెండి)
2. అవి నచ్చక పోతే ఆ రోజు మీ జాతకం ఎలా ఉందో చూడొచ్చు.(కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుకుంటే ఏమీ చేయ్యలేం)
3. ప్రొద్దున్నే గూటిని వదిలే పిట్టలని చూడొచ్చు (ఇక్కడ పిట్టలు అంటే పక్షులు అని నా ఉద్దేశం.ఇంకోలా అనుకుంటే నా తప్పు కాదు)
కాబట్టి ఇన్ని లాభాలు పొందాలి అంటే నా సూచనలు పాటించండి.
ప్రొద్దున్నే లేవాలి అంటే ఇంకో గ్యారంటీ చిట్కా … ముందు రోజు రాత్రి వచ్చే మీకు ఇష్టమైన టీము IPL మాచ్ చూడొద్దు.దెబ్బకి ప్రొద్దున్నే ఏమి అయ్యిందో తెలుసుకోవడానికి, పేపర్ కోసం నిద్ర లేస్తారు.
ఇవన్నీ చెప్పడానికి ఎంతో సులువైనా పాటించడం సంకటేష్ ఇంటర్వ్యూలో తేలుగు మాట్లాడినంత కష్టం.
ప్రయత్నించండి.పని చేస్తుంది అనిపిస్తే పాటించండి.నాకు పని చేసింది.ఇందాక చెప్పినట్టు మీకు పని చెయ్యాలి అనీ లేదు,పని చెయ్యదు అనీ లేదు.
(గమనిక: ఈ టపాలో కొందరు ప్రముఖుల పేర్లు వాడడం జరిగింది.అది సరదా కోసమే కాని ఎవరినీ బాధ పెట్టడానికి కాదు అని మనవి.నేను కూడా తెలుగు సినిమా అభిమానినే)


04/21/2010 at 2:45 ఏ ఎమ్
భలే చెప్పారు…
నేను నిశాచర జీవిని ఐనా పొద్దున్నే లేవాలని ప్రతిరోజు యమదొంగ లెవెల్లో గాఆఆ..ట్టిగా తీర్మానించుకుంటా సాఫ్ట్‌వేర్‌లో compilation అదుర్స్ కాని ఎప్పుడూ runtime ఎర్రర్‌వుంటుంది…,హా మీరు చెప్పినట్టు మొదటి రెండు ఉద్యోగల్లో ఏదో ఒకటి చూసుకోవాలేమో!!
టైటిల్ జస్టిఫికేషన్ చేసారు..మరి మీకోసం మీ అభిమాన భలేకృష్ణ, జితిన్ మీ కథ అయితేనే కొత్త సినిమా తీస్తామంటున్నారు, వాళ్లకు కబురెట్టేదా??
>>ప్రొద్దున్నే గూటిని వదిలే పిట్టలని చూడొచ్చు << హి హి. పొద్దున్నే లేవడానికి అసలు కారణం ఇదీ అని చెప్పొచ్చుగా
04/21/2010 at 2:52 ఏ ఎమ్
వ్యాఖ్య రాసినందుకు థాంక్స్
భలేక్రిష్ణ కి,జితిన్ కి కధలు ఇవ్వగలిగే రేంజ్ లో నేను ఇంకా లేను.నేను ఆ రేంజ్ లోకి వచ్చేసరికి వాళ్ళు ఉంటారో ఉండరో మరి
- పవన్
04/21/2010 at 1:50 సాయంత్రము
ఇంత బాగా మంచి విషయాలు సెలవిస్తున్నారు మరి మీరు మన సత్యానందంలా చక్కగా ఏదైనా ఆశ్రమం పెట్టి అన్నీ నేర్పించవచ్చుగదా సరదాగా.
04/21/2010 at 10:45 సాయంత్రము
అంత సరదా ఎందుకులెండి.అనుకోకుండా ఆ సత్యానందా ఈ రోజే దొరికిపోయాడు.ప్రొద్దున్నే ప్రజలను హింసిస్తే ఇలాంటి శిక్షలే పడతాయి అని గరుడ పురాణంలో ఉందట.
టపా చదివి వ్యాఖ్య రాసినందు ధన్యవాదములు
- పవన్
04/21/2010 at 11:32 సాయంత్రము
“ఈ టపాలో కొందరు ప్రముఖుల పేర్లు వాడడం జరిగింది” అన్నారు. అందరి ప్రముఖులు తెలుసు కాని ఈ “సచిన్” ఎవరండి (“సచిన్ సిక్సు కొట్టినట్టు…”)?
04/21/2010 at 11:54 సాయంత్రము
కాంత్ గారు,
మీరు తెలియక అదుగుతున్నారో,తెలిసి సరదాగా అడుగుతున్నారో అర్థం కావడం లేదు.
తెలియక అడిగితే – మీరు చాలా మిస్స్ అవుతున్నారు అని అర్థం
తెలిసి అదిగితే – సచిన్ కి మారు పేరు పెట్టడం ఇష్టంలేక అలా పెట్టాను
టపా చదివినందుకు, వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములు
- పవన్
04/22/2010 at 7:44 సాయంత్రము
తెలిసే అడిగానండీ వపన్ గారు
BTW, ప్రొద్దున్నే లేవడానికి చిట్కాలు చాలా బాగున్నాయండీ (చదవడానికి). పాటించడమే కొంచెం కష్టం. ఇలాగే రాస్తుండండి.