ఎర్ర బస్సు కథలు – పెద్దాయన
04/19/2010
టైం ఉదయం 8.30.వైజాగ్ బస్టాండ్.
అరకు వెళ్ళే బస్సులో ఉన్నాను.బస్సు నిండుగానే ఉన్నా డ్రైవరు ఎంతకీ ఎక్కడం లేదు.నేను ఆలోచనలో పడ్డాను.అసలు అరకు ఎందుకు వెళ్తున్నానా అని.
నిన్ననే చెన్నై నుంచి ఊరిలో దిగాను.ఇంజినీరింగ్ చేసిన తరువాత ఉద్యోగరిత్యా చెన్నై మహానగరంలో ఉంటున్నాను.ఈసారి మూడు నాలుగు రోజుల శెలవలు వచ్చాయి.నేను ఇంకో 2 రోజులు లీవు తీసుకొని వైజాగ్ వచ్చేసాను.ఇంటర్ చదువుతున్నప్పుడూ,ఇంజినీరింగ్ లోనూ అరకు రెండు మూడుసార్లు వెళ్ళడం జరిగింది.జాబ్ లో చేరాక కుదరలేదు.రెండు వారాల క్రితం మా వినయ్ గాడికి ఫొను చేస్తే అరకులో జాబ్ చేస్తున్నాను,ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు రమ్మన్నాడు.అందుకే ఈ ప్రయాణం.
అసలు ట్రైనులో వెళ్దాము అని అనుకున్నాను కాని ట్రైను ఉదయం 7కి అయితే 7.30కి స్టేషనుకి వెళ్ళాను.తరువాత రోజు ట్రైనులో వెళ్దాం అనుకొని మా వాడికి ఫొను చెస్తే బస్సులో వచ్చేయ్, ఈ రోజు అంతా తిరుగుదాం రేపు ఇద్దరం కలిసి వైజాగ్ వచ్చేద్దాం, అయినా ట్రైను కన్నా బస్సు ఇంకా బాగుంటుంది అన్నాడు.ఈసారి వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అనుకొని ఇదిగో ఇలా బస్సులో బయలుదేరాను.
కండక్టరు టికెట్లు ఇచ్చిన పావుగంటకు టీ తాగి,దమ్ము కొట్టి బస్సు తీసాడు డ్రైవర్.చాలా చిరాకు వచ్చింది కాని ఇంకా చాలా దూరం వెళ్ళాలి చిరాకుగా ప్రయాణం చేస్తే ఇంకా దూరంలా అనిపిస్తుంది అనుకొని మారిపోయిన మా ఊరిని చూస్తూ కూర్చున్నా.ప్రపంచంలో ఉన్న టైము అంతా తన దగ్గరే ఉన్నట్టు వెళ్తున్నాడు డ్రైవర్.
ఎన్.ఏ.డి జంక్షను వచ్చాక ఇద్దరు ముగ్గురు ఎక్కారు.బస్సు బయలుదేరుతుండగా ఎవరో బస్సుని గట్టిగా కొడుతున్నట్టు అనిపించింది.డ్రైవరు స్లో చేసాడు.ఒక పెద్దాయన గాబరగాబరాగా ఎక్కాడు.
“ఎందుకు అంత గాబరా? అర గంటకో బస్సు ఉంది.కింద పడుంటే ఉన్న పళ్ళు అన్నీ రాలిపోయేవి” డ్రైవర్ గట్టిగా తిట్టాడు.ముందునున్న ఇద్దరు ఆడవాళ్ళు నవ్వారు.
అతను ఏమీ అనలేదు.వచ్చి, నాకు 2 సీటుల ముందు కూర్చున్నాడు.కండక్టరు వచ్చి టికట్ టికట్ అని అరిచాడు.
పెద్దాయన “ఆ?!!” అన్నాడు.
“టికట్ తాతా టికట్,ఏక్కడికి వెళ్ళాలి?”
“కరకవలస” అని 100 ఇచ్చాడు.
“చిల్లర లేదు తరువాత తీసుకో” అనేసి టికెట్టు ఇచ్చేసి,100 నోటు జేబులో పెట్టుకొని వెళ్ళిపొయాడు.
అప్పుడు చూసాను ఆ పెద్దాయన్ని దగ్గర నుంచి.బట్టలు మాసి పోయి ఉన్నాయి,మాసిన గడ్డంతో మరీ ఎక్కువ వయస్సు ఏమీ కాకపోవచ్చు అనిపించింది.మనిషిలో ఏదో కళ ఉంది.
మధ్యలో పెందుర్తి దగ్గర ఒక కాలేజీ గాంగ్ ఎక్కింది.
బస్సు మెల్లగా కదులుతోంది.దారి పొడువునా ఆ కాలేజీ గాంగ్ పాటలు,అల్లరితో గడిచిపోయింది.అందరూ ఎంజాయ్ చేసారు,ఆ పెద్దాయన తప్ప.ఒక గంటన్నర తరువాత ఎస్.కోట చేరాం.
“బస్సు ఒక పావుగంట ఆగుతుంది.తరువాత అంతా ఘాట్ రోడ్డే ఏమీ దొరకదు.టీలు,టిఫిన్లు ఇక్కడే” గట్టిగా అరిచేసి వెళ్ళిపొయాడు కండక్టర్.
నాకు బయట తినడం ఇష్టం ఉండదు.నేను బస్సులోనే కూర్చున్నా.అందరూ దిగిపోయారు ఆ పెద్దాయన,నేను తప్ప.ఇంతలో గుర్తుకు వచ్చింది మంచి నీళ్ళు తీసుకు రాలేదని.బస్సు దిగడానికి వెళ్తుంటే ఆ పెద్దాయన కూర్చున్న దగ్గర 500 నోటు కనిపించింది.అది తీసి ఎటో చూస్తున్న అతన్ని పిలిచి చేతిలో పెట్టను.అతను ఏమీ అనకుండా జేబులో పెట్టుకొని మళ్ళీ ఎటో చూడడం మొదలు పెట్టాడు.
బస్సు దిగాక అనిపించింది అనవసరంగా ఇచ్చాను అసలు థాంక్సు లేదు,ఏమీ లేదు అని.తరువాత అనుమానం వచ్చింది అసలు అది అతనిదేనా అని.ఇప్పుడు ఇంకేమీ చెయ్యలేము అనుకొని వాటర్ బాటిల్,ఈనాడూ కొనుక్కొని వచ్చి కూర్చున్నా.
పావు గంట అయినా డ్రైవరు బస్సు తీసే సూచనలు కనబడటం లేదు.పేపరు తీసి చదవడం మొదలు పెట్టా.ఇంతలో బస్సు హారను వినిపించింది.హమ్మయ్య చివరకి తీస్తున్నాడు అనిపించింది.
తీరా చూస్తే ఈ పెద్దాయన వెళ్ళి హారను కొడుతున్నాడు.
డ్రైవరు కోపంగా వచ్చి “అంత గాబరా గా ఉంటే ఏ ఆటో లోనో వెళ్ళొచ్చు కదా,మాకూ నీ బాధ తప్పేది” అని తిట్టాదు.ఈసారి ఇద్దరు ఆడవాళ్ళతో పాటు కాలేజి గాంగ్ కూడా కిసుక్కున నవ్వారు.అతను ఏమీ అనలేదు.అలాగే కూర్చున్నాడు.
“చెవుడేమోలేరా !! నువ్వు బండి తీయ్”, అరిచాడు కండక్టరు.
బస్సు మళ్ళీ బయలుదేరింది.కొంచెం దూరం రైలు పట్టాలతో తో పాటు వెళ్ళి, ఇంకొంత దూరం వెళ్ళాక ఇందాక కండక్టరు చెప్పిన ఘాట్ రోడ్డు ఎక్కింది.చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న జలపాతాలతో చాలా బాగుంది.
అందరూ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నారు.ఈ పెద్దాయన మాత్రం జేబులోంచి పర్సు తీసి ఏదో చూసుకొని మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు.
ఒక చోట రోడ్డు కింద నుంచి రైలు సొరంగం ఉంది.కాలేజీ గాంగ్ డ్రైవర్ ని బ్రతిమాలుకొని అక్కడ దిగి ఫొటోలు దిగడం మొదలు పెట్టారు.డ్రైవరు కూడా దిగి వాళ్ళకి ఏదో చూపిస్తున్నాడు.ఇంతలో మళ్ళీ ఈ పెద్దాయన వెళ్ళి హారను కొట్టాడు.ఈ సారి డ్రైవరుకి కోపం నషాలానికి ఎక్కింది.
“నువ్వు బస్సు దిగవయ్యా ముందు.మమ్మల్ని పట్టుకొని తినేస్తున్నావ్” అని అరవడం మొదలు పెట్టాడు.పెద్దాయన మాత్రం ఏమీ అనకుండా వచ్చి సీటులో కూర్చున్నాడు.
“ఎందుకు వచ్చిన గొడవలే శివా పదపద”, కండక్టర్ అన్నాడు పెద్దాయన్ను కోపంగా చూస్తూ.
మధ్యలో బొర్రా గుహల దగ్గరా పావు గంట ఆపేశాడు.ఏమీ తోచక పక్కన పడేసిన పేపర్ తీసా.నిన్ననే దంతేవాడాలో నక్సలైట్లు జవాన్లని కాల్చేసారట.నాకు వెంటనే అనుమానం వచ్చింది కొంపదీసి ఈ పెద్దాయన ఏ నక్సలైటో,తీవ్రవాదో కాదు కదా అని.మనిషి కొంచం తేడా గానే ఉన్నాడు.మాటిమాటికీ పర్సు తీసి చూసుకుంటున్నాడు.సినిమాల్లో చూపించినట్టు ఏ సుసైడ్ బాంబరో కాదు కదా.
బొర్రా గుహలు దాటాక అక్కడక్కడ విసిరేసినట్టు పాకలు కనిపిస్తున్నాయి.
ఒక్కసారిగా పెద్దాయన లేచి “ఆపండి!!!”, అని అరిచాడు.
“ఇంక కరకవలస వరకూ ఆగేది లేదు.టికెట్టు అక్కడికే తీసుకున్నావు కద.ఎగతాళిగా ఉందా.ఇంక 15 కిలోమీటర్ల వరకూ ఆగడం కుదరదు”, కండక్టర్ అన్నాడు.
“ఆపండి!! ఆపండి!!”, ఈ సారి ఇందాకటి కన్నా గట్టిగా అరిచాడు.
అతను దిగిపోతే కాస్త కుదురుగా ఉండొచ్చు అని మనసులో అనుకొని, ”సరేలెండి ఆపేయండి.పాపం పెద్దాయన”,అన్నాను నేను.
కండక్టరు ఈలకి బస్సు ఆగింది.అందరూ తిట్టుకుంటున్నారు.
అప్పుడు కిటికీ బయటకు చూసా.ఒక చిన్న ఇల్లు.బయట కొంచం జనం.పెద్దాయన పరుగు పరుగున లోపలికి వెళ్తున్నాడు. లోపలి నుంచి ఒక్కసారిగా ఏడుపులు వినిపించాయి.
బయట నలుగురు కూర్చొని పాడె సిధ్ధం చేస్తున్నారు.
- పవన్
(గమనిక: మలయాళంలో వచ్చిన కేరళా కెఫే అన్న సినిమాలోని ఒక కధ ఆధారంగా)


04/20/2010 at 1:26 సాయంత్రము
చాలా బాగా రాసారు పవన్ గారు.కొత్తగా బ్లాగు పెట్టినందుకు కంగ్రాట్స్!కాకపోతె నేను కూడా బ్లాగు పెట్టి,కొన్నాళ్లగా ఏమి రాయకుండా బద్దకిస్తున్నా!మీరు అలా చేయకండి,ఒక మంచి బ్లాగు మిస్సవడం నాకు ఇష్టం లేదు.
04/20/2010 at 2:12 సాయంత్రము
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములు
మీ బ్లాగు చూసాను.చాలా బాగుంది.మీ అంత బాగా రాయడానికి ప్రయత్నిస్తాను
- పవన్
04/20/2010 at 5:06 సాయంత్రము
కథ బాగుంది. బాగా వ్రాసారు. ఇంతకీ ఇది నిజమేనా.
04/20/2010 at 6:11 సాయంత్రము
చాలా వరకూ నిజమే ఆ ముగింపు తప్ప.మనం రోజూ చాలామందిని చూస్తుంటాం గాభరా పడుతూ.ఎందుకంత తొందర అని అనిపిస్తుండేది నాకు.కాని వాళ్ళ పరిస్తితి ఏమిటో తెలియకుండా ఏమీ అనుకోకూడదు అని ‘కేరళ కెఫె ‘ అన్న మళయాళ సినిమా చూశాక తెలిసింది.
నిజ జీవితంలో జరగడానికి చాలా అవకాశం ఉన్న కథ అనిపించి రాశాను.
చదివినందుకు,వ్యాఖ్యానించినందుకు ధన్యవాదములు
- పవన్